Ayyayyo Nedella Yi Jivunaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ayyayyo Nedella yi Jivunaku Lyrics ॥

వరాళి – రూపక (- ఆది)

పల్లవి:
అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య ॥

చరణము(లు):
చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య ॥
వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు ॥

మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు ॥
ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు ॥

అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు ॥
మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు ॥

ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు ॥
జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు ॥

వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు ॥
వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు ॥

పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు ॥
వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓరామ ॥

ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు ॥
అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు ॥

ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటిగదా కొన్నాళ్ళు ॥
చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య ॥

పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలోనలిగి వరలుచు నుంటిగదా కొన్నాళ్ళు ॥
పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు ॥

See Also  Lingashtakam Stotram In Telugu – Audio

లేతరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు ॥
తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామా ॥

తెల్లతెల్లనై దంతము లూడివణకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు ॥
బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు ॥

అంతట మృతినొంది యలయుచు యమునిచే బాధలొందితిగా కొన్నాళ్ళు ॥
ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు ॥

కంజజనక భద్రాచలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు ॥
వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామా ॥

ఆధారము – రామదాసు కీర్తనలు
సంపాదకులు: మంచాళ జగన్నాథరావు
ఆంధ్రప్రదేశ్‌ సంగీతనాటక అకాడమీ, 1975

Other Ramadasu Keerthanas: