భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Na Moralakimpavemayya O Rama Lyrics ॥
ఆరభి – చతురశ్ర ఏక
పల్లవి:
నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ
నా మొరాలకింపవేమి నా ॥
అను పల్లవి:
నా మొరాలకింపవేమి న్యాయమా ప్రపంచమందు
స్వామి నీకన్న నన్ను సంతరించు వారలెవరు నా ॥
చరణము(లు):
ఉన్నవిధము విన్నవించితి నా హృదయమందు
నిన్ను మఱువకెప్పుడునుంచితి
కన్నతండ్రివైన నీకు కఠినహృదయమైతే నేను
కన్నవిన్నవారినెల్ల యిపుడు గాచి గొల్వలేను నా ॥
మ్రొక్కగానే మోడిసేతురా నా పాపమెల్ల
నుగ్గడింప నూరకుందురా
దిక్కు ఎవరు లేరు నీవె దిక్కటుంచు నమ్మినాను
ఇక్కడికి నీ కటాక్షమేల రాకున్నదయ్యయో నా ॥
చేతగానివాడివైతివో మున్ను నీవు
రాతికభయమీయవైతివో రామ
భూతలమందు ప్రఖ్యాతి జెందినావు నాదు
వ్రాతఫలమదేమో తలచవైతివయా నెనరులేదో నా ॥
మదముచేత తెలియనైతిని పాపమంచు
పృథివి యందు యెంచనైతిని ఓ రామ
కదసి నేను చేసినట్టి కర్మ మనుభవించవలెను
ఇదిగో నీ పాపముల గతి యటంచు నమ్మినాను నా ॥
నీ సమాన దైవమెవ్వరు ఈ లోకమందు
నీ సమానధీరులెవ్వరు
దాసుడంటె భద్రశైలవాస వేరుసేయబోకు
గాసి మాన్పుమిపుడు రామభూప వీరరాఘవేంద్ర నా ॥