భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Naaraayana Yanarada Mee Lyrics ॥
నాదనామక్రియ – త్రిపుట
పల్లవి:
నారాయణ యనరాదా మీ
నాలికపై ముల్లు నాటియున్నదా నా ॥
చరణము(లు):
పనిలేని వార్తలు నూరు యట్టే
పలుమారు వాదించి పలుకుచున్నారు
మనసున వెతలెల్ల తీరు మీ
జననము లీడేర జనులార మీరు నా ॥
ఆలుబిడ్డల పొందు బాసి వట్టి
అడవిలోపల పండుటాకులు మేసి
జాలిచెందుట వట్టిగాసి
లెస్స సంసారియైయుండి సమబుద్ధిజేసి నా ॥
తొడరి చిక్కులు బుట్టు తాను బుద్ధి
బొడమ నీయడు ఒక గడియైనాను
అడలి సంసారములోను చిక్కు
బడనేల నీ బుద్ధి బంగారుగాను నా ॥
కలుషవారధికి నావ నిన్ను
గలిసేటందుకు చక్కని బాట త్రోవ
ఇలలో తెలివికి దేవదేవ
నరహరి నామకీర్తనములె లేవ నా ॥
కామక్రోధముల చాలించి పూర్వ
కర్మబంధములెల్ల తుదముట్ట త్రెంచి
శ్రీమంతుడై భక్తిగాంచి
భద్రాచలరామదాసుని మదిలోన యెంచి నా ॥