Ramasudhambudhidhama Ramanapai In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ramasudhambudhidhama Ramanapai Lyrics ॥

సావేరి – చాపు (మధ్యమావతి – త్రిపుట)

పల్లవి:
రామసుధాంబుధిధామ రామనాపై
ఎందుకు దయరాదుర సీతా రా ॥

అను పల్లవి:
వేమరు వినయముతో వివరించితే
నా మనవి వినవేమిరా రా ॥

చరణము(లు):
మక్కువ నేనెంతో బతిమాలుకొన్న నీ మనసు కరగదేమిరా రామ
నిక్కముగా తల్లితండ్రి నీవని నెరనమ్మియున్నానురా రామ
దిక్కు నీవనియున్న దయజూడవిక మాకు దిక్కెవరున్నారురా రామ
ఎక్కడనున్నావో నా మొరాలకించవింత పరాకేలరా రామ రా ॥

ప్రతిదిన ముదరపోషణ చేయుటే దొడ్డవ్రతమని తిరిగితిరా రామ
మతిలేని ధనికులే గతియని దినదినము స్తుతిచేయసాగితిరా రామ
సతతము మాయ సంసారము నమ్మి దుర్గతినొంద నేనుంటిరా రామ
పతితపావన చాల వెతనొంది వచ్చితి గతిజూపి రక్షింపరా రామ రా ॥

నీపాదసేవ జేసిన సజ్జనులకు ఏపాపము లంటవుగా రామ
తాపత్రయముల మాన్పి నను నీదరిచేర్చి కాపాడవదేమిరా రామ
ఈపట్ల రక్షించి గాపాడకున్ననే నెవరివాడనౌదురా రామ
ఆపద్బాంధవ భద్రాద్రి రామదాసు డనుచు నన్నేలుకోరా రామ రా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Narahari Nammaka Narulanu Nammite In Telugu – Sri Ramadasu Keerthanalu